నన్ను తిట్టడమే ఇప్పుడున్న పని
హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో తన అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తాజాగా రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని ప్రశంసించారు. ఇదే ఒరవడిని రాబోయే ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు. పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇదిలా ఉండగా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు ఇలాంటి అహంకారపూరిత హింస ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో నేర్పుతున్నదని అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు మంచి చేసే ఒక్క పాలసీనైనా తీసుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఇది ప్రజా ప్రభుత్వం కానేకాదని పేదలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని మండిపడ్డారు కేసీఆర్. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో సర్కార్ లేదని కేవలం రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇకనైనా విమర్శలు మాని ప్రజల గురించి పట్టించు కోవాలని సూచించారు.






