రథ సప్తమికి ఘనంగా ఏర్పాట్లు
టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి
తిరుమల – ఈనెల 16న తిరుమలలో నిర్వహించే రథ సప్తమి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.
సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసమే టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఏవీ ధర్మా రెడ్డి భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి వారు ఒకే రోజు సూర్య ప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్ప వృక్ష, సర్వ భూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు.
వాహన సేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏవీ ధర్మా రెడ్డి.
హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్న వయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు జరుగోందని తెలిపారు.
దేశం నలుమూలల నుండి 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేశారని వెల్లడించారు ఏవీ ధర్మా రెడ్డి. పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.