కల్పవృక్ష వాహనంపై సిరుల తల్లి
రాజమన్నార్ స్వామి అలంకారంలో
తిరుపతి – తిరుచానూరు లోని ప్రముఖ పుణ్య క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మ వారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు.
శ్రీ రాజ గోపాల స్వామి వారి అలంకారంలో చంద్రోకలు, దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మ వారు భక్తులకు అభయం ఇచ్చారు. గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో అమ్మ వారిని కీర్తించారు. చిరు జల్లుల మధ్య వాహన సేవ కన్నుల పండువగా జరిగింది.
కల్పవృక్ష వాహనం ఐహిక ఫల ప్రాప్తికి ప్రసిద్ది అని కథనం. పాల కడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలి దప్పుల్ని తొలగించి, పూర్వ జన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది.
ఖడ్గాన్ని, యోగ దండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళ దేవత అల మేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్త .వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో జె.శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.