కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్
నిప్పులు చెరిగిన జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు . ఆదివారం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ తయారు చేసిన ఛార్జ్ షీట్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో డీకే అరుణ, ఈటల రాజేందర్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాపురం కిషన్ రెడ్డి ప్రసంగించారు. ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. గాడి తప్పిన పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అయినా సర్కార్ కు సోయి ఉండడం లేదన్నారు గంగాపురం కిషన్ రెడ్డి. ఆరు గ్యారెంటీలు 66 అబద్దాలు అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ విడుదల చేసిన చార్జ్ షీట్ లో సంచలన అంశాలు పొందుపర్చారు . మొత్తంగా రాష్ట్రంలో రాజకీయం మరింత వేడిని రాజేసింది.