శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 67, 496
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తుండడంతో ఎక్కడ చూసినా భక్త జన సందోహమే కనిపిస్తోంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు టీటీడీ ఈవో జే శ్యామల రావు.
డిసెంబర్ 1న ఆదివారం భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు తిరుమలకు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 67 వేల 496 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 064 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించారు.
భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 3.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ కార్య నిర్వహణ అధికారి జె. శ్యామలా రావు వెల్లడించారు.
ఇక స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, ఇక సర్వ దర్శనానికి కనీసం 6 గంటలకు పైగా సమయం పడుతుందని పేర్కొన్నారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి.