DEVOTIONAL

వైభవంగా లక్ష్మీ కాసులహారం శోభా యాత్ర‌

Share it with your family & friends

గ‌జ‌, గ‌రుడ వాహ‌నాల్లో అమ్మ వారికి అలంక‌ర‌ణ‌

తిరుప‌తి – తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర సోమవారం తిరుచానూరులో వైభ‌వంగా జ‌రిగింది. ముందుగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుండి అద‌న‌పు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం – ప‌సుపు మండ‌పం వద్దకు తీసుకొచ్చారు. అక్క‌డ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల‌లో లక్ష్మీ కాసుల హారం అత్యంత ప్ర‌ధాన‌మైంద‌ని అన్నారు. పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా ఈ హారాన్ని శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారికి అలంక‌రిస్తామ‌ని తెలిపారు.

సాక్షాత్తు స్వామి వారు ధ‌రించే ఈ హారాన్ని గజ వాహనం, గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మ వారికి అలంకరించడం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. రాత్రి జ‌రుగ‌నున్న గ‌జ వాహ‌నానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్టు వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.