గజ వాహనంపై శ్రీ పద్మావతి కటాక్షం
ఘనంగా అమ్మ వారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఓ వైపు తుపాను కారణంగా భారీ వర్షాలు వస్తున్నా ఎక్కడా లెక్క చేయడం లేదు భక్తులు. అమ్మ వారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.
ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మ వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని సేవించుకున్నారు.
వాహన సేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, బోర్డు సభ్యులు సుచిత్ర, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.