అమరుడా నీకు అభివందనం
శ్రీకాంతాచారి ఆత్మార్పణ రోజు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న కాసోజు శ్రీకాంతాచారి రోజు ఇవాళ. యావత్ నాలుగున్నర కోట్ల ప్రజలు నివాళులు అర్పిస్తోంది. ఈ దేహం తెలంగాణకు అంకితం అంటూ ఆనాటి ఆంధ్ర పాలకుల దాష్టీకాన్ని నిరసిస్తూ తనను తాను ఆత్మార్పణం చేసుకున్న ధీరుడు..వీరుడు శ్రీకాంతాచారి.
ఆయన చేసిన ఆత్మార్పణ దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. జ్ఞాపకాల పొదలలో కెలుకుతూనే ఉన్నాయి. కేసీఆర్ చేసిన మలిదశ పోరాటానికి ఊపిరి పోసిన వ్యక్తి శ్రీకాంతాచారి. తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకునేందుకు, బలమైన ఆకాంక్షను తెలియ చేసేందుకు ఈ బలిదానం ఊపిరి పోసింది. చైతన్యవంతం చేసేలా చేసింది. కోట్లాది మందిని రగిలించేలా చేసింది. సంబండ వర్ణాలు కలిసి ముందుకు సాగేలా రగిలించింది.
తాడో పేడో తేల్చుకునేందుకు పోరాటం చేసేలా శ్రీకాంతాచారి అమరత్వం కీలకంగా మారింది. తాను అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినదించిన ఆ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా వణుకు పుట్టించేలా చేసింది. ప్రతి ఒక్కరిలో ఉద్యమ జ్వాలను రగిలించింది.
తెలంగాణ రాదని భావించి 2009 నవంబర్ 29న హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ చౌరస్తాలో అందరూ చూస్తూ ఉండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఐదు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. వీర మరణం పొందాడు.
శ్రీకాంతాచారిది పేద కుటుంబం. విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తల్లిదండ్రులు వెంకటాచారి, శంకరమ్మ. 1986 ఆగస్టు 15న పుట్టాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ కు వచ్చాడు. ఆ తర్వాత తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నాడు. వీరుడా నీ మరణం వృధా కాదు. నీకు జోహారులు అందజేస్తోంది తెలంగాణ సమాజం. నాలుగున్నర కట్ల ప్రజానీకం.