శ్రీకాంతాచారి బలిదానం చిరస్మరణీయం
ఘనంగా నివాళులు అర్పించిన దాసోజు
హైదరాబాద్ – అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ” అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని పేర్కొన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ . ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
కెసిఆర్ అరెస్టును, ఉద్యమ కారులపై ప్రభుత్వ అణిచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
కాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న కాసోజు శ్రీకాంతాచారి రోజు ఇవాళ. ఈ దేహం తెలంగాణకు అంకితం అంటూ ఆనాటి ఆంధ్ర పాలకుల దాష్టీకాన్ని నిరసిస్తూ తనను తాను ఆత్మార్పణం చేసుకున్న ధీరుడు శ్రీకాంతాచారి.
1986 ఆగస్టు 15న పుట్టిన శ్రీకాంతాచారి 2009 నవంబర్ 29న హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఒంటిపై కిరోసిన్ నిప్పంటించుకున్నాడు. డిసెంబర్ 3న తుది శ్వాస విడిచాడు.
ఆయన చేసిన ఆత్మార్పణ దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. జ్ఞాపకాల పొదలలో కెలుకుతూనే ఉన్నాయి.
కేసీఆర్ చేసిన మలిదశ పోరాటానికి ఊపిరి పోసిన వ్యక్తి శ్రీకాంతాచారి. తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకునేందుకు, బలమైన ఆకాంక్షను తెలియ చేసేందుకు ఈ బలిదానం ఊపిరి పోసింది. చైతన్యవంతం చేసేలా చేసింది. కోట్లాది మందిని రగిలించేలా చేసింది. సంబండ వర్ణాలు కలిసి ముందుకు సాగేలా రగిలించింది.