గోవా జెడ్పీ ఎన్నికల్లో గెలుపుపై మాణిక్ రావు ఠాక్రే
గోవా : గోవా రాష్ట్రంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఈ సందర్బంగా స్పందించారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జెడ్పీ విజయం కేవలం ప్రారంభం మాత్రమేనని చెప్పారు. గోవా ఓటర్లు బీజేపీ అబద్దపు వాగ్దానాలు, విభజన రాజకీయాలతో విసిగి పోయారని అన్నారు. శిథిలావస్థలో ఉన్న మౌలిక సదుపాయాల నుండి విఫలమైన ఆర్థిక విధానాల వరకు, ప్రస్తుత ప్రభుత్వం ప్రతి గోవావాసిని నిరాశ పరిచిందని అన్నారు ఠాక్రే. ఈ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో మా విజయాలు, అంకితభావం గల నాయకులు సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర పర్యాటకం, పంచాయతీల సాధికారత అనే దార్శనికతతో నడిచే కాంగ్రెస్ క్షేత్రస్థాయి పునరుజ్జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
ముందుకు చూస్తే ఈ జోరు 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలలో మాకు నిర్ణయాత్మక విజయాన్ని అందిస్తుందని తాము బలంగా విశ్వసిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు మాణిక్ రావు ఠాక్రే. ప్రజలు మార్పుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సామరస్యం, శ్రేయస్సు, పురోగతికి ప్రతీకగా గోవా కీర్తిని పునరుద్ధరిస్తూ, అందరి కోసం నిజంగా పనిచేసే ప్రభుత్వాన్ని అందించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దీనిని సాధ్యం చేసిన ఓటర్లకు, పిసిసి అధ్యక్షుడు అమిత్ పాట్కర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలమావో, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నామని అన్నారు.





