అగ్నిమాపక శాఖ పని తీరుపై ఫైర్
నిప్పులు చెరిగిన అనిత వంగలపూడి
అమరావతి – అగ్ని మాపక శాఖ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హోం , విపత్తుల నిర్వహణ శాఖా మంత్రి వంగలపూడి అనిత. సచివాలయం లోని హోంమంత్రి కార్యాలయంలో జైళ్ల శాఖ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలపై సమీక్ష చేపట్టారు. ఇటీవల ఎన్ బీ సీ మార్గదర్శకాలు గాలికి వదిలేసి భద్రత ప్రమాణాలు పాటించని భవన నిర్మాణాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంపై మండిపడ్డారు.
ఎన్ఓసీలు ఇచ్చే నేపథ్యంలో చేస్తోన్న అక్రమాలను ఉపేక్షించబోనని హోంమంత్రి హెచ్చరించారు. తర్వాత సమీక్ష కల్లా పరిస్థితి మారక పోతే కఠిన వైఖరి అవలంబించాల్సి ఉంటుందని హోంమంత్రి స్పష్టం చేశారు.
సిబ్బంది పనితీరు, వసతుల కల్పన, పర్యవేక్షణపై అధికారులకు హోం మంత్రి కీలక ఆదేశాలిచ్చారు. విపత్తు నిర్వహణ శాఖపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లలో వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ పర్యవేక్షించాలని సూచించారు . పర్యాటక ప్రాంతాలు, తుపాను షెల్టర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో ఉన్న ముందస్తు హెచ్చరికలను పంపే వ్యవస్థ(ఈడబ్ల్యూడీఎస్) సైరన్ అలారమ్ సిస్టం పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు.
విపత్తు సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్ట నివారణ చర్యలతో పాటు సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన అత్యాధునిక శిక్షణ వంటి అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. విధ్వంసం సృష్టించే వాయుగుండం సమయంలో కలిగే నష్టాల అంచనా కోసం అవసరమైన పరికరాల మరమ్మతులు సహా కొత్త టెక్నాలజీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుని విపత్తు నిర్వహణ శాఖను పటిష్టంగా మార్చాలని సమావేశంలో నిర్ణయించారు.