DEVOTIONAL

పంచమి తీర్థానికి ఏర్పాట్లు పూర్తి – ఈవో

Share it with your family & friends

శ్రీవారి సారే ఊరేగింపు మార్గం పరిశీలన

తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబరు 6వ తేదీన జరుగనున్న పంచమి తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. అలిపిరి నుండి శ్రీవారి సారే ఊరేగింపు మార్గాన్ని ఈవో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. పంచమి తీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి సారే ఊరేగింపుగా అలిపిరి చేరుకుంటుందన్నారు. అలిపిరి నుండి శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరులోని పసుపు మండపం, అమ్మ వారి ఆలయాన్ని తీసుకుని వచ్చి పూజలు నిర్వహిస్తామన్నారు. తరువాత పంచమి తీర్ధ మండపనికి వేంచేసి అమ్మ వారికి అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్‌ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులు వేచి ఉండేందుకు నాలుగు ప్రాంతాలలో షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి నుండి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద, జడ్పీ హైస్కూలు, పూడి రోడ్డులో, తిరుచానూరు రోడ్లలో ఏర్పాటుచేసిన క్యూలైన్లలో భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.

భక్తులు వేచి ఉండటానికి ఏర్పాటు చేసిన షెడ్లులో అన్నప్రసాదం, ఆల్ఫ ఆహారం, బాదంపాలు, తాగునీరు అందిస్తామన్నారు. మహిళలకు పురుషులకు వేరు వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు గేట్లు, బారీకేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండడంతో టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్ర‌తి ఏడాది పంచ‌మి తీర్థంకు విచ్చేసే భ‌క్తుల సంఖ్య పెరుగుతూ ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు వివరించారు.

ప‌ద్మ పుష్క‌రిణిలో ఉదయం 12 గంటలకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. పంచమి తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలన్నారు.

జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కులగకుండా 1200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అలిపిరి నుండి తిరుచానూరులోని పసుపు మండపం వరకు శ్రీవారి సారే ఊరేగింపుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు వాహనాల పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు ఉపయోగించుకొని పుష్కరిణిలో పవిత్ర స్నానం అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్ ఏ అండ్ సిఏఓ బాలాజీ, సివిఎస్వో శ్రీధర్, ఆల‌య డెప్యూటీ ఈవో గోవింద రాజన్, టిటిడి ఉన్నతాధికారులు, పోలీస్, పంచాయతీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.