ఆప్కోలో భారీ డిస్కౌంట్ అమ్మకాలు
అమరావతి : ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వస్త్ర కొనుగోలుదారులకు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. తెలుగువారి పెద్ద పండుగను సంప్రదాయరీతిలో జరుపుకోవాలని, ఇంటిళ్లపాది చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత కోరారు. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు ప్రారంభించాలని మంత్రి సవిత ఆదేశించారు. ఆప్కో షో రూమ్ ల్లో వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్న వస్త్రాలను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. నిర్ణీత గడువును నిర్దేశించుకుని ఈ కొనుగోళ్లు ముగించాలన్నారు. సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలను నేరుగా ఆప్కో షో రూమ్ లకు తరలించాలని స్పష్టం చేశారు.
ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కు రూ.38.31 కోట్లు, పిఠాపురం స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు రూ.15.11 కోట్లు, మంగళగిరి హ్యాండ్లూమ్ పార్క్ కు రూ.22.36 కోట్లు, అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటుకు రూ.15 కోట్లు, 30 ఆప్కో షో రూమ్ ల అభివృద్ధికి రూ.8.82 కోట్లతో ప్రపోజల్స్ ను కేంద్రానికి పంపినట్లు చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి తెలిపారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ, నేషనల్ హ్యాండ్లూమ్ డవలప్ మెంట్ ప్రొగ్రాం కింద కేంద్రానికి పంపించిన రూ.99.60 కోట్ల విలువైన ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు వచ్చేలా కృషి చేయాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.





