ఛాంబర్ లో కొలువు తీరిన టీటీడీ చైర్మన్
సీటులో ఆసీనులైన బీఆర్ నాయుడు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి టీటీడీ నూతన చైర్మన్ గా ఎంపికైన బీఆర్ నాయుడు దంపతులు గురువారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో పూజలు చేశారు. అనంతరం తనకు కేటాయించిన ఛాంబర్ సీటులో ఆసీనులయ్యారు.
ఆయనను అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు పండితులు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో ఏనాడూ తాను టీటీడీ చైర్మన్ గా అవుతానని అనుకోలేదని అన్నారు.
ఇదంతా తనకు ఆ దేవ దేవుడు, కలియుగ వైకుంఠ వాసుడు కల్పించిన మహత్ భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు బీఆర్ నాయుడు. తాను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, కానీ వాటన్నింటిని దాటుకుంటూ ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఆ కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామినేనని అన్నారు.
ఆయన చల్లని చూపులు ఇరు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని తాను ఆ భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు బీఆర్ నాయుడు.