ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం
హైదరాబాద్ : ఏసీబీ దాడులలో విస్తు పోయే నిజాలు బయట పడ్డాయి. భారీ అవినీతి తిమింగలం చిక్కింది. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా సంపాదించిన ఓ అవినీతి జిల్లా స్థాయి అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు కిషన్ నాయక్. తను హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో నివాసం ఉంటున్నాడు.
అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయన ఇంటితో పాటు, నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఉన్న తన బంధుమిత్రుల ఇళ్లతో కలిపి 12 చోట్ల తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ సోదాలలో బైర్లు కమ్మేలా విస్తు పోయేలా వాస్తవాలు బయట పడ్డాయి. కిషన్ నాయక్ కు నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాలు, నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3000 గజాల వాణిజ్య స్థలం, కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో రూ.1.37 కోట్ల నగదు, అశోక్ టౌన్ షిప్‌లో రెండు ఫ్లాట్లు, 4000 గజాల స్థలంలో పాలి హౌస్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ఏసీబీ డీజీ చారుసిన్హా
కిషన్ నాయక్ బంధువుల ఇంట్లో దొరికిన ఆస్తి పత్రాలన్నీ స్వాధీనం చేసుకున్నామని, ఆయన ఆస్తులు రూ.250 కోట్లు ఉంటాయని ప్రకటించారు.





