రాష్ట్ర వ్యాప్తంగా బీసీ భవన్ల నిర్మాణం
బీసీ సంక్షేమ మంత్రి సవిత
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్లు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్ . సవిత తెలిపారు. బీసీ యువతకు ఆర్థిక దన్ను కలిగేలా స్వయం ఉపాధి పథకాలు అందజేయనున్నట్లు ప్రకటించారు
సోమందేపల్లి మండలం కేంద్రంలో రూ.80 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించనున్న భగీరథ కల్యాణ మండపం భూమి పూజా కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సోమందేపల్లిలో అభివృద్ధి పనుల నిమిత్తం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు.
రూ.5 కోట్లకు పైగా నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. పట్టణంలో 1.40 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం ప్రారంభించామని, త్వరలో రోడ్లు వినియోగంలోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. నాలుగు బోర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కరించామన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా పైప్ లైన్లు నిర్మించి 300 ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.
ప్రస్తుతం సోమందేపల్లి రైతులు ఆ నీటితో పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. త్వరలో సోమందేపల్లిలో జూనియర్ కళాశాలతో పాటు ఐటీఐ కూడా నిర్మించనున్నామని, వచ్చే ఏడాది నుంచి ఐటీఐ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలోనూ బీసీ భవన్లతో , కమ్యూనిటీ భవన్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ కబుర్లు చెప్పిన జగన్ రెడ్డి అన్ని వర్గాల మాదిరిగా బీసీలనూ మోసం చేశారని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలోనే సీఎం చంద్రబాబు బీసీల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపార వేత్తను తయారు చేయాలన్న లక్ష్యంలో భాగంగా బీసీ యువతతో వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.