12న తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి
వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామల రావు
తిరుమల – తిరుమలలో జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రముఖమైన చక్రతీర్థ ముక్కోటి ఈనెల 12వ తేదీన ఘనంగా జరుగనుంది. పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసివున్న శేషగిరుల మీద దక్షిణభాగంలో కొన్ని మైళ్ల దూరంలో మహా పవిత్ర తీర్థమగు చక్ర తీర్థం వెలసివుంది. ప్రతి ఏడాది కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది.
ఆరోజున స్వామి వారికి ప్రాతఃకాల, మధ్యాహ్న ఆరాధనలు పూర్తి అయిన తరువాత అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు, యాత్రికులు మంగళ వాయద్యాలతో స్వామి వారు ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారు వారికి, నరసింహస్వామి వారికి, ఆంజనేయస్వామి వారికి అభిషేకం, పుష్పాలంకారం, ఆరాధన చేస్తారు. హారతి నివేదించిన అనంతరం తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
స్కంద పురాణాను సారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాల్సిందిగా చెప్పి అంతర్థానమయ్యాడు.
పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు.
ఆ తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండే విధంగా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా సుప్రసిద్ధిగాంచింది.
వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థము కూడా ఒకటిగా భాసిల్లుతోంది.