ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య
ప్రకటించిన భారతీయ జనతా పార్టీ
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది. రాజ్యసభకు సంబంధించి సోమవారం జాబితా విడుదల చేసింది. ఏపీ నుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను ఖరారు చేసింది. హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ ను ఎంపిక చేసింది. వీరి ఎంపిక లాంఛనం కానుంది. గతంలో ఎంపీగా ఉన్న కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉండగా ఆర్. కృష్ణయ్యకు బీసీ ఉద్యమకారుడిగా పేరుంది. ఆయన స్వస్థలం తెలంగాణ . 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు. 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆ తర్వాత అనూహ్యంగా జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు.
ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆర్ కృష్ణయ్య పేరు ర్యాగ కృష్ణయ్య. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం రాళ్లగుడుపల్లి పల్లె. ఎంఏ, ఎల్ఎల్ఎం, ఎంఫిల్ చదివారు.