ఆశా తల్లులపై దాడులు దారుణం
నిప్పులు చెరిగిన హరీశ్ రావు
హైదరాబాద్ – పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నామంటూ గొప్పలు చెబుతూ, మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తమని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో హామి ఇచ్చారని గుర్తు చేశారు.
ఇప్పుడు ఆ హామీ అమలు చేయాలంటూ అశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలిపే హక్కు లేదా? సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్చ లేదా అని నిలదీశారు హరీశ్ రావు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశాల గౌరవ వేతనం రూ. 1500 మాత్రమే ఉంటే, కేసీఆర్ రూ. 10 వేలకు పెంచి వారి సేవలను గుర్తించి గౌరవింఆచరని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.
ప్రశ్నిస్తే పోలీసులతో పళ్లూడగొట్టించే దుర్మార్గ వైఖరిని అవలంబిస్తూ, ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు.