ఆశా వర్కర్లపై దాడి అమానుషం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ – ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకు ఆడబిడ్డలను ఖాకీలతో కొట్టించడం దారుణమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సోమవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
నెలకు రూ 18 వేలు వేతనం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలియజేసిన ఆశా వర్కర్లను దారుణంగా కొడుతూ పోలీస్ వ్యాన్ లలో ఎక్కించిన తీరు.. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న నిర్బంధాలు, అణచివేతకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందన్నారు.
ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ అంటూ ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత.
అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో, బతుకమ్మ ఆడే చేతులతోనే, ఆడబిడ్డలు కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని హెచ్చరించారు కవిత.