సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
హైదరాబాద్ – ప్రజలకు ప్రభుత్వానికి మధ్య తాను వారధిగా పని చేస్తానని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు , మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అధికారికంగా సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సంతకం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
పార్టీ హైకమాండ్ తనపై నమ్మకం ఉంచి అరుదైన అవకాశం ఇచ్చిందని, తనకు ముందు నుంచి సహకరిస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. ముందు నుంచీ తాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నానని, పదవులు అనేవి శాశ్వతం కావని, ప్రజలకు సేవలు అందించడమే గొప్ప అదృష్టంగా తాను భావిస్తానని స్పష్టం చేశారు మొహమ్మద్ అలీ షబ్బీర్.
పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. షబ్బీర్ అలీని అభినందనలతో ముంచెత్తారు.