కుమార స్వామి కామెంట్స్ షర్మిల సీరియస్
బాధ్యతా రాహిత్యంతో మాట్లాడితే ఎలా..?
అమరావతి – కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి కుమార స్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అసలు ప్లాంట్ ప్రతిపాదనే లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపాదన వస్తే ఆలోచన చేస్తామని చెప్పడం ఏపీ ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు వైఎస్ షర్మిల. ఇంత జరుగుతున్నా రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ముందు నుంచీ కేంద్ర సర్కార్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు.
కడప ఉక్కు సీమ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమే సెయిల్ ఆధ్వర్యంలో నిర్మించి ఇచ్చేలా కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు. విభజన చట్టంలోనూ పెట్టిందన్నారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసిందని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. సీమ ప్రజల మనోభావాలను దెబ్బ తీసిందన్నారు. తిరుపతి వేదికగా కడప స్టీల్ పై హామీ ఇచ్చిన మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు.
కడప స్టీల్ ప్లాంట్ పై మీ వైఖరి ఏమిటో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. కేంద్ర సర్కార్ కు వంత పాడుతారా లేక ప్లాంట్ ఏర్పాటు కోసం పోరాటం చేస్తారా చెప్పాలన్నారు. బాబు రెండుసార్లు టెంకాయలు కొడితే, మాజీ సీఎం జగన్ రెడ్డి మరో రెండుసార్లు కొబ్బరికాయలు కొట్టిన విషయం మరిచి పోయారా అని మండిపడ్డారు.