హామీలు సరే అమలు ఎక్కడ
నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ ధ్వజమెత్తారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు కేటీఆర్.
సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరంగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. అరచేతిలో స్వర్గం చూపించారని, అన్యాయంగా అధికారంలోకి వచ్చారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఒక్క తెలంగాణలోనే అభివృద్ది జరిగిందన్నారు. ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ ఇవాళ హైదరాబాద్ కు తీసుకు వచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. కానీ జనం మనల్ని ఎందుకు నమ్మలేదనే దానిపై పునరాలించు కుంటున్నామని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు కేటీఆర్. సార్వత్రిక ఎన్నికల్లో 17 సీట్లల్లో విజయం సాధించాలని ఇందుకు పార్టీ కేడర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు.