సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాకిటి
మహబూబ్ నగర్ జిల్లా : రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంచలనంగా మారారు. ఆయన చేసిన పనికి జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇందుకు కారణం తను చేసిన మంచి పని. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వనపర్తి జిల్లాకు వెళుతున్నారు హైదరాబాద్ నుంచి. ఏడో నెంబర్ బెంగళూరు జాతీయ రహదారి పై బాలానగర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఇదే సమయంలో మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్ ను ఆపి బస్సు దగ్గరికి వెళ్లారు. ప్రమాద స్థలం లో ఆక్సిడెంట్ అయిన కార్ ను మంత్రి స్వయంగా పక్కకు తోశారు. బోల్తా పడ్డ బస్సును క్రేన్ సాయంతో పక్కకు తీయించారు. హైదరాబాద్ వెళ్లే రహదారి పై భారీగా ట్రాఫిక్ జాం కావడం తో మంత్రి స్వయంగా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.
గాయపడ్డ విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదానికి గురై భయ బ్రాంతులకు లోనైన విద్యార్థులకు మంత్రి ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదం లో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని షాద్ నగర్ డాక్టర్ లకు ఫోన్ చేసి చెప్పారు. విద్యార్థులకు దగ్గరుండి అన్ని చూసుకోవాలని ఆదేశించారు. మంత్రి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేసి విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వడంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ లోని రిషి విద్యాలయానికి చెందిన విద్యార్థులు విహార యాత్ర కోసం హైదరాబాద్ లోని జల విహార్ కు బయలు దేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.






