తెలుగోళ్లు అంతా మనోళ్లే
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది తెలంగాణ సర్కార్.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమానికి దేశంలోనే అత్యున్నతమైన రెండో పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ. 25,00,000 రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.
అనంతరం ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మ అవార్డుల సత్కార కార్యక్రమం రాజకీయాలకు అతీతమన్నారు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా మన వాళ్లేనని స్పష్టం చేశారు. కవులు, కళాకారులు, రచయితలకు ఆసరా కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
నగదు పురస్కారంతో పాటు నెలకు రూ. 25,000 చొప్పున పెన్షన్ కూడా ఇవ్వాలని ఇప్పటికే కేబినెట్ ఒప్పుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.