శ్రీ బేడి ఆంజనేయుడికి ప్రత్యేక అభిషేకం
శాస్త్రోక్తంగా నిర్వహించిన టీటీడీ
తిరుమల – తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసి వున్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూల మూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా టీటీడీ ఈవో జె. శ్యామల రావు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పర్వదినం సందర్బంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఈ సందర్బంగా సుదూర ప్రాంతాలం నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈనెల 28న డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా భక్తులు సలహాలు, సూచనలు ఇవ్వదల్చుకుంటే తనకు నేరుగా ఫోన్ చేయాలని సూచించారు. సామాన్య భక్తులకు త్వరగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.