పద్మ పురస్కారం సంతోషకరం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్ – తాను సన్మానాలకు, పురస్కారాలు తీసుకునేందుకు ఇష్ట పడనని కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి పద్మ విభూషణ్ తీసుకోవాలని కోరారని ఆసక్తికర వ్యాఖలు చేశారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
ఆదివారం శిల్ప కళా వేదికలో పద్మ పురస్కారాలు పొందిన పద్మ విభూషణ్ , పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా తనను ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఘనంగా సత్కరించినందుకు సంతోషంగా ఉందన్నారు వెంకయ్య నాయుడు. సీఎం రేవంత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రస్తుతం రాజకీయాలు కలుషితమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను పిలిచి సన్మానం చేయడం అభినందనీయమని, ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రశంసనీయమని పేర్కొన్నారు.