మహాకుంభ మేళాలో పటిష్ట ఏర్పాట్లు
టిటిడి జేఈవో గౌతమి వెల్లడి
తిరుపతి – ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు జరుగనున్న మహాకుంభ మేళలో శ్రీవారి నమూనా ఆలయం ద్వారా ఉత్తరాది భక్తులు స్వామి వారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జేఈవో గౌతమి అధికారులకు సూచించారు. టిటిడి పరిపాలనా భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జేఈవో గౌతమి మాట్లాడుతూ టిటిడి ఈవో శ్యామల రావు ఆదేశాల మేరకు 45 రోజుల పాటు సాగే మహాకుంభ మేళకు దాదాపు 2.50 ఎకరాల విస్తీర్ణంలో టిటిడి నుండి విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు.
తిరుమల తరహాలో స్వామి వారి కైంకర్యాలు చేపట్టాలని, శ్రీవారి నమూనా ఆలయానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. టిటిడి వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు.
శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని తెలిపారు. మహాకుంభ మేళకు సంబంధించి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ చేపట్టాలన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని టిటిడికి కేటాయించిన స్థలంలో రాజీ లేకుండా మరింత మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళా బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
యూపీ పోలీస్ అధికారులతో టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రయాగ్ రాజ్ లో వాతావరణానికి తగ్గట్లు ముందస్తు మౌళిక సదుపాయాలు కల్పించాలని, మెడికల్ సిబ్బంది, మందులు సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ , హెల్త్ అండ్ మెడికల్ అధికారులకు సూచించారు.
మహాకుంభ మేళకు సంబంధించి ప్రత్యేక రోజులలో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించాలని, టిటిడిలోని వివిధ శాఖలతో ప్రజా సంబంధాల శాఖ సమన్వయం చేసుకుని విసృత ప్రచారం చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, డిపిపి సెక్రటరీ రఘునాథ్, డిపిపి ప్రోగ్రాం ఆఫీసర్ రాజగోపాల్. ఎస్ఈ (ఎలక్ట్రికల్) వేంకటేశ్వర్లు, ఎస్.ఈ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు ఆర్. సెల్వం, శివప్రసాద్, ప్రశాంతి, గుణభూషణ్ రెడ్డి, ఏవీఎస్వో సతీష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.