సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్
కాణిపాకం : వైకుంఠ ద్వార దర్శనం , కొత్త సంవత్సరం పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలో పేరు పొందిన కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు కలెక్టర్. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసి బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ దీప అలంకరణ, అత్యవసర అవసరాల కోసం జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ పి డి సి ఎల్ అధికారులను, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. పోలీస్ సిబ్బంది ద్వారా బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని, అగ్నిమాపక శాఖ ద్వారా ఫైర్ ఇంజిన్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈ మూడు రోజులు అంతరాలయ దర్శనం అవకాశం కల్పించడం లేదన్నారు.
ఎస్పి మాట్లాడుతూ ఆంగ్ల సంవత్సరాదికి ఆలయం వద్ద చిత్తూరు డి ఎస్ పి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. వీటితో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల పార్కింగ్ సంబంధించి స్థలం పరిశీలించామన్నారు. జిల్లా అధికారుల సమన్వయంతో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. సుమారు 200 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించి కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టానున్నామన్నారు. పూతలపట్టు ఎం ఎల్ ఏ మాట్లాడుతూ గత అనుభవాల దృష్ట్యా ఆంగ్ల సంవత్సరాదికి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం సుమారు 60 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలుస్తుందని, ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి, వరుస సెలవులు రావడంతో మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. రద్దీ పెరిగినా భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కలిగించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయం వద్ద ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారన్నారు.







