శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు
తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా భారీ ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల లోని అలిపిరి మెట్ల మార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆదివారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, తదితరులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా, అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను తప్పక వినియోగించు కోవాలని కోరారు. టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడిక్స్ బృందం, ఈసిజి యంత్రం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, నెబ్యులైజర్, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.







