తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష
మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్
తిరుమల – మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఇవాళ తిరుమల శ్రీివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులను పట్టించు కోవడం లేదని ఆరోపించారు.
సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చే వారిని విస్మరించడం దారుణమన్నారు . గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఇకనైనా ఏపీ సర్కార్ తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడిగా పేరు పొందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
శ్రీవారిని దేశంలోని అన్ని ప్రాంతాల నుండి దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారని, దర్శనానికి సంబంధించి ఇలాంటి నిబంధనలు పెట్టడం మంచి పద్దతి కాదన్నారు. ఏపీకి చెందిన వారు కూడా తెలంగాణలో చాలా మంది ఉన్నారని, వారంతా తమ ప్రాంతానికి వెళ్లి పోవాలని అని హెచ్చరిస్తే సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు కోవాలని అన్నారు.