రైతుల ఆందోళన ప్రియాంక ఆవేదన
కనీస మద్దతు ధరపై స్పందించాలి
ఢిల్లీ – మోడీ సర్కార్ రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ప్రియాంక గాంధీ. బీజేపీ పదేళ్లలో రైతులను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి అన్యాయం చేశారంటూ వాపోయారు.
కనీస మద్దతు ధర చట్ట బద్దమైన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మోడీ స్పందించి రైతుల డిమాండ్లను అంగీకరించాలని కోరారు. గత కొన్నేళ్లుగా తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతులు ఆందోళన బాట పట్టారని అయినా చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు.
ఇది మంచి పద్దతి కాదన్నారు. తక్షణమే ప్రభుత్వం, ప్రధాని మోదీ స్పందించి రైతుల డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేశారు ప్రియాంక గాంధీ. రైతులకు న్యాయం కావాలని కోరుతూ సర్దార్ జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని, రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వాపోయారు .
వెంటనే దల్లేవాల్ దీక్షను విరమింప చేసేలా చర్యలు తీసుకోవాలని, రైతులు చేస్తున్న ఆందోళనకు ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ. శుక్రవారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు .