మోదీ ప్రభుత్వం యువతకు శాపం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
లఢఖ్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదన్నారు. సోమవారం ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏటా 2 కోట్ల జాబ్స్ భర్తీ చేస్తామని మాయ మాటలు చెప్పారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ఈ దేశంలో యువత తీవ్రమైన నిరాశలో ఉన్నారని వారికి భరోసా కల్పించాలని కోరారు.
తాము ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నామని, కానీ కేవలం మతం, కులం ఆధారంగా రాజకీయాలను వాడుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఇక చాలా చోట్ల యువత రోజుకు 200 నుంచి 300 కిలోల బొగ్గును సైకిళ్లపై మోసుకుంటూ 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరంతా ఇంత కష్ట పడినా వారికి రోజుకు వచ్చేది నామ మాత్రమేనని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. వారితో నడవకుండా , వారి భారాన్ని అనుభవించకుండా వారి సమస్యలను అర్థం చేసుకోలేమన్నారు. ఈ యువ కార్మికుల జీవితం మందగిస్తే భారత దేశ నిర్మాణ చక్రం కూడా ఆగి పోతుందని హెచ్చరించారు.