ఘన స్వాగతం పలికిన మంత్రులు, చైర్మన్
తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రముఖులు, సెలిబ్రిటీలు , ప్రజా ప్రతినిధులు పోటెత్తారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం తిరుమలకు చేరుకుంది. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, వాణిజ్య, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ , ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు గ్రాండ్ వెల్ కం చెప్పారు. భారీ భద్రత మధ్య తను రేణిగుంట నుంచి తిరుమలకు వెళ్లారు.
అక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు మంత్రులు స్వాగతం పలికారు. స్వామి వారి చిత్ర పటాన్ని సీఎం రేవంత్ రెడ్డికి బహూకరించారు. తన కుటుంబ సమేతంగా తిరుమలను దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్బంగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆ దేవ దేవుడైన కలియుగ వైకుంఠ వాసుడిని ప్రార్థించానని తెలిపారు.







