ఇంద్రకీలాద్రిపై ఆధ్మాత్మిక పరిమళాలు
పర్యవేక్షించిన మంత్రి అనిత వంగలపూడి
ఎన్టీఆర్ జిల్లా – ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భవాని దీక్షా విరమణలు ఆధ్యాత్మిక పరిమళాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు వేకువజామున మూడు గంటల నుంచే వేలాది మంది భవానీ భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకొని అనంతరం అమ్మ వారిని దర్శించుకొని, మాల విరమణ చేశారు.
మోడల్ గెస్ట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) కార్యకలాపాలను మంత్రి వంగలపూడి అనితతో పాటు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖర బాబు, డీసీపీ గౌతమి శాలి పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
సీసీ టీవీలు, డ్రోన్ విజువల్స్ ద్వారా నిరీక్షణ పాయింట్లతో పాటు పార్కింగ్, క్యూలైన్లు, ఘాట్లు, దర్శనం, ప్రసాదం కౌంటర్లు, హోమ గుండాలు, గిరి ప్రదక్షిణ, అన్న ప్రసాదం పంపిణీ పాయింట్ల వద్ద రద్దీని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
చిన్నారులు ఒకవేళ తప్పిపోతే వారి జాడను వెంటనే తెలుసు కునేందుకు ఈసారి దుర్గమ్మ ఆలయం అందుబాటులోకి తెచ్చిన చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్)పై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు రాత్రి 11 గంటలు నాటికి మొత్తం 1,960 మంది చిన్నారులకు క్యూఆర్ కోడ్ ట్యాగ్లు వేశారు.
శాంతి భద్రతల పరిరక్షణకు, భక్తుల భద్రతకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు, నిఘా ఏర్పాటు చేసింది. అంతకంతకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు క్షేత్రస్థాయి బృందాలను ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు.
అన్ని లైన్లలో ఉచిత దర్శన సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించు కుంటున్నారు. అత్యంత ముఖ్యమైన పారిశుధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, విజయవాడ ఆర్డిఓ కావూరి చైతన్య, ఆలయ ఈవో కేఎస్ రామరావు తదితరులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.