డాక్టర్ అంబేద్కర్ ఖచ్చితంగా దేవుడే
మాజీ మంత్రి రఘువీరా రెడ్డి కామెంట్
అనంతపురం జిల్లా – మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య భారతదేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడేనని అన్నారు. రాజ్యాంగం దేశ ప్రజల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతోన్న పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు.
ఆదివారం రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆనాడు తమ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు ఉన్న అనుభవం, జ్ఞానాన్ని గుర్తించి రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిందని చెప్పారు.
రాజ్యసభలో అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తన స్థాయికి, పరిణతికి తగ్గ వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
ఈ దేశంలో అణగారిన కులాలు, వర్గాలు, పేదలు, బడుగు, బలహీన వర్గాలకు నిజంగా బాబా సాహెబ్ అంబేద్కర్ దైవంగా భావిస్తారని చెప్పారు. తక్షణం దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర మంత్రి పదవికి అమిత్ షా అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని అన్నారు.