అల్లు అర్జున్ లో పశ్చాతాపం లేదు
నిప్పులు చెరిగిన ప్రభుత్వ విప్ ఆది
హైదరాబాద్ – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. నటుడు అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావాలని సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం దారుణమన్నారు. ఒక హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవన్నారు. విచిత్రం ఏమిటంటే తనలో ఎలాంటి పశ్చాతాపం కనిపించ లేదన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని ఆది డిమాండ్ చేశారు.
ఆదివారం ప్రభుత్వ విప్ మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ రియల్ హీరో కానే కాదన్నారు. ఆయన కేవలం రీల్ హీరో అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తాను తప్పే చేయలేనట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు .
శాసన సభలో సీఎం మాట్లాడిన మాటలను తప్పు పట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. చని పోయిన రేవతి కుటుంబం పట్ల అల్లు అర్జున్ కనీసం సానుభూతి చూపించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ చని పోయిందని చెప్పినా హీరో కనీసం స్పదించక పోవడం దారుణమన్నారు. తన కొడుకు బాధ పడుతున్నాడని అల్లు అరవింద్ చెప్పడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.