ఏసీపీ విష్ణుమూర్తిపై క్రమశిక్షణా చర్యలు
ప్రకటించిన డీసీపీ ఆకాంక్ష్ యాదవ్
ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ విష్ణుమూర్తిపై వేటు పడింది. ఈ మేరకు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంష్ యాదవ్. కాగా విష్ణుమూర్తి గతంలో నిజామాబాద్ లో టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా పని చేశారు. ఆయనపై ఆరోపణలు రావడంతో డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. అక్టోబర్ 2024లో సస్పెండ్ అయ్యారు.
ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయన అల్లు అర్జున్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం సాధించాడని సినీ సెలిబ్రిటీలు క్యూ కట్టారంటూ ప్రశ్నించారు.
అల్లు అర్జున్ కు ఏమైందని సందర్శించారని, పరామర్శించారంటూ ఎద్దేవా చేశారు. అంతే కాదు ఆయనకు ఏమైనా కాలు పోయిందా, కిడ్నీలు పాడయ్యాయా అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. ఇదే సమయంలో ఏసీపీ విష్ణు మూర్తి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తమ జోలికి వస్తే తోలు తీస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో లక్షా 30 వేల మంది పోలీస్ కుటుంబాలను కించ పరిచేలా మాట్లాడితే బాగుండదంటూ హెచ్చరించారు.