శ్రీతేజ్ కుటుంబానికి బండి భరోసా
అన్ని విధాలుగా ఆదుకుంటాం
హైదరాబాద్ – సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్న శ్రీతేజ్ ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతిని కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందారు.
శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ను ఓదార్చారు. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని, ఎంత ఖర్చైనా సరే భరిస్తామని స్పష్టం చేశారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కష్టకాలంలో కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయన అల్లు అర్జున్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం సాధించాడని సినీ సెలిబ్రిటీలు క్యూ కట్టారంటూ ప్రశ్నించారు.
అల్లు అర్జున్ కు ఏమైందని సందర్శించారని, పరామర్శించారంటూ ఎద్దేవా చేశారు. అంతే కాదు ఆయనకు ఏమైనా కాలు పోయిందా, కిడ్నీలు పాడయ్యాయా అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. ఇదే సమయంలో ఏసీపీ విష్ణు మూర్తి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తమ జోలికి వస్తే తోలు తీస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో లక్షా 30 వేల మంది పోలీస్ కుటుంబాలను కించ పరిచేలా మాట్లాడితే బాగుండదంటూ హెచ్చరించారు.