అంగరంగ వైభవంగా పీవీ సింధు పెళ్లి
ఉదయ్ పూర్ లో ని ఓ దీవిలో ఒక్కటయ్యారు
ఉదయ్ పూర్ – భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయి ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లోని ఓ దీవిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.
తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి శాస్త్రబద్ధంగా పెళ్లి తంతును నిర్వహించారు. పండితుల వేదమంత్రాల నడుమ రాత్రి 11.20 గంటల సమయంలో సింధు మెడలో దత్తసాయి మూడు ముళ్లు వేశాడు.
కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిపి సుమారు 140 మంది ముఖ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగుదనంతో పాటు రాజస్థాన్ రాచరిక సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్ జరగనుంది.
ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవి వేదికగా సింధు వివాహం జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవిలో రఫల్స్ సంస్థ భారీ రాజప్రసాదాన్ని తలపించే రిసార్ట్‌ను నిర్మించింది. వంద గదులతో కూడిన మూడు ప్రధాన భవంతులు ఈ రిసార్ట్‌లో ఉన్నాయి.
అతిథులను ప్రత్యేక పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ రిసార్ట్‌లో సాధారణ గదికి ఒక్క రోజు అద్దె సుమారు రూ. లక్ష. సింధు పెళ్లి నిమిత్తం అతిథుల కోసం ఈ 100 గదులను బుక్ చేశారు. అంతేకాక ఈ పెళ్లికి హాజరైన వారికి సింధు కుటుంబం ప్రత్యేకంగా విమాన టిక్కెట్ల బుక్ చేసింది.