రోడ్ల నాణ్యతను పరిశీలించిన పవన్
నాణ్యత లోపిస్తే చూస్తూ ఊరుకోం
కృష్ణా జిల్లా – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. మొన్నటికి మొన్న గిరిజన గూడేలలో పర్యటించారు. పాఠశాలలను పరిశీలించారు. పిల్లలతో ముచ్చటించారు. తాజాగా కృష్ణా జిల్లా గొడవర్రులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన రహదారి పనుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఎక్కడ నాణ్యత లోపించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు డిప్యూటీ సీఎం.
గిరిజనుల అభివృద్దికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తమ కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం గురించి ఎక్కువగా దృష్టి సారించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
తాము వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణం, అభివృద్దిపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ఎక్కువగా నిధులు కేటాయించేలా చూశామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2047 స్వర్ణాంధ్ర విజన్ ను తయారు చేయడం జరిగిందన్నారు. దీని వల్ల మరింత అభివృద్ది కొనసాగేలా చూస్తామన్నారు.