విధుల్లో చేరిన ట్రాన్స్‌జెండర్స్
సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్
హైదరాబాద్ – ఇవాల్టి నుంచి విధుల్లో చేరారు ట్రాన్స్ జెండర్స్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ పోలీసులు . మొత్తం 39 మందిని ఎంపిక చేసింది పోలీస్ శాఖ. వీరికి డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ , ఔట్, ఇండోర్‌తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలో డెమో ఇచ్చారు. తమను నియమించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు ట్రాన్స్ జెండర్స్.
కాగా సామాజిక సమ్మేళనం దిశగా తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వీరికి సామాజిక గౌరవం కల్పించే దిశగా ప్రయత్నం చేసింది. వీరిని ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్ లు గా పిలుస్తారు. వారిని హోం గార్డులుగా పరిగణిస్తారు. వారికి ఇచ్చే వేతనాలను వీరికి వర్తింప చేస్తారు.
హోంగార్డుల హోదాలో సేవలు అందిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం వీరిని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుంది. భవిష్యత్తులో ఇతర విభాగాలకు కూడా ఈ చొరవను విస్తరింప జేయాలనే ఆశతో ట్రాన్స్‌జెండర్లను ప్రభుత్వ సేవా పాత్రల్లోకి చేర్చే లక్ష్యంతో వీరిని ఎంపిక చేశారు.
ఈరోజు యావత్ దేశం తెలంగాణ చొరవ వైపు చూస్తోంది. ఇది సామాజిక అంగీకారానికి కొత్త ఉదాహరణగా నిలుస్తుంది. తరతరాలుగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సామాజిక కళంకాలను ఛేదించే అవకాశాన్ని అందిస్తుందని అన్నారు పోలీస్ కమిషనర్ ఆనంద్.