స్మగ్లింగ్ చేసే హీరోకు అవార్డులా
నిప్పులు చెరిగిన దాసరి సీతక్క
హైదరాబాద్ – పుష్ప-2 మూవీపై భగ్గుమన్నారు మంత్రి దాసరి సీతక్క. చివరి దాకా ప్రజల కోసం విలువలే ప్రామాణికంగా బతికిన జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా తీసిన జై భీమ్ సినిమాకు అవార్డులు రాలేదని, కానీ స్మగ్లింగ్ చేసే హీరో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు దక్కడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ స్మగ్లర్లు హీరోలు..పోలీసులు, లాయర్లు జీరోలుగా మారడం దారుణమన్నారు.
విచిత్రం ఏమిటంటే కేంద్రం నియమించిన అవార్డుల కమిటీ ఎలా అవార్డులను ఎంపిక చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కోట్లాది మందిని ప్రభావితం చేసిన జై భీమ్ కు ఎందుకు పురస్కారం దక్కలేదని ప్రశ్నించారు. ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని నిలదీశారు సీతక్క.
సభ్య సమాజానికి మీరు ఏం సందేశం చెప్పాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఇదేనా మీరు నేర్పించేది అంటూ మండిపడ్డారు. సినిమాలు అంటే తమకు గౌరవం ఉంది కానీ అవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని స్పష్టం చేశారు మంత్రి దాసరి సీతక్క.
సినిమా పేరుతో, హీరోయిజం పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే చూస్తూ ఎవరూ ఊరుకోరని అన్నారు. ఇకనైనా మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.