1.18 లక్షల టిడ్కో గృహాలు పూర్తి చేస్తాం
ప్రకటించిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – వచ్చే ఏడాది జూన్ 12 వ తేదీ కల్లా 1.18 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన 44 వ సీఆర్డిఏ సమావేశం సచివాలయంలో జరిగిందన్నారు.
రాజధాని అమరావతి అభివృద్ది పనులకు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకుని నాన్ పెర్పార్మింగ్ ఎస్సెట్స్ గా మిగిలి పోయిన టిడ్కో గృహాలను పూర్తి చేయడానికి రూ.102 కోట్లను చెల్లించేందుకు సీఎం ఆమోదం తెల్పారన్నారు.
2014-19 మద్య కాలంలో కేంద్ర ప్రభుత్వంచే 7,01,481 టిడ్కో గృహాలను మంజూరు చేయించి, వాటిలో 5.00 లక్షల గృహాలకు పరిపాలనా పరమైన అనుమతులను కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. వాటిలో 4,54,706 గృహాలను గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు.
ప్రతి యూనిట్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.3.90 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించగా, అందులో రూ.1.90 లక్షలు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా నిర్ణయించడం జరిగిందని చెప్పారు.
అదే విధంగా లబ్దిదారుని వాటగా చెల్లించాల్సిన సొమ్మును బ్యాంకు రుణంగా ఇప్పించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కానీ గత ప్రభుత్వం అదికారంలోకి వచ్చి ఈ ప్రక్రియను అంతా గందరగోళం చేయడం జరిగిందని ఆరోపించారు.