దాడులు చేస్తే అరెస్టులు తప్పవు
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – ప్రతి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల మందికి పైగా ప్రయాణీకులను తమ తమ గమ్య స్థానాలను ఆర్టీసీ బస్సులు చేరవేస్తున్నాయని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్. ఈ సందర్బంగా కొత్త సర్కార్ కొలువు తీరాక ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించిందని, దీని కారణంగా పదే పదే సిబ్బందిపై, ఉద్యోగులపై దాడులకు దిగడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇక నుంచి ఎవరు దాడికి పాల్పడినా వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఉద్దేశ పూర్వకంగా సిబ్బందిపై కొందరు దాడులకు పాల్పడుతుండడం దారుణమన్నారు. ఇది సమాజానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు.
తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఇద్దరు ఫరూక్ నగర్ డిపోకు చెందిన డ్రైవర్ , కండక్టర్ పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు. క్రికెట్ బ్యాట్ తో తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరిగిందని, డ్రైవర్ షేక్ అబ్దుల్ కు గాయాలైనట్లు వాపోయారు.
ఇక నుంచి ఉపేక్షించ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.