మేం ఏ కూటమిలో చేరబోం – ఎంపీ
స్పష్టం చేసిన విజయ సాయి రెడ్డి
అమరావతి – వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాము త్వరలో ఇండియా కూటమిలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇదంతా సత్య దూరమని పేర్కొన్నారు. అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీయేకు మేం సమాన దూరంగా ఉంటామన్నారు. ఏ కూటమిలో చేరే ఆలోచన ఇప్పుడు లేదన్నారు. తమది న్యూట్రల్ స్టాండ్ అని స్పష్టం చేశారు.
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయమే చెబుతామని చెప్పారు. మంగళవారం ఎంపీ విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని కుండ బద్దలు కొట్టారు.
రాష్ట్రంలో కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన సాగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. కేవలం ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజల చెవుల్లో పూలు పెట్టాడని ఆరోపించారు.