సాఫ్ట్ వేర్ హబ్ గా నూజివీడు
మంత్రి కొలుసు పార్థసారథి
హైదరాబాద్ – సాఫ్ట్ వేర్ హబ్ గా నూజివీడును తీర్చిదిద్దుతానని ప్రకటించారు మంత్రి కొలుసు పార్థసారథి. ఐఐఐటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మరింత పేరు రానుందన్నారు. అమెరికా స్టార్టప్ కంపెనీ పారాబోలా 9 – AI కంపెనీ 35 లక్షల పెట్టుబడితో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. దీని ద్వారా 23 మంది స్టూడెంట్స్ కు ఉచితంగా శిక్షణ ఇవ్వడం తో పాటు ఉపకార వేతనం లభిస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో నూజివీడులో మరికొన్ని ఐటీ, లాజిస్టిక్ కంపెనీలను తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు కొలుసు పార్థసారథి. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నోమార్లు జగన్ కు చెప్పినా పట్టించు కోలేదని వాపోయారు.
కానీ అనూహ్యంగా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో తిరిగి అధికారంలోకి రావడంతో రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా మారి పోతోందన్నారు. ఇందుకు కారణం సీఎం అని పేర్కొన్నారు. ఏపీని ఐటీ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు కొలుసు పార్థసారథి. ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వచ్చే ఔత్సాహికులు, స్టార్టప్ నిర్వాహకులు, కంపెనీలు, పెట్టుబడిదారులకు సాదర స్వాగతం పలుకుతామని చెప్పారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు .