
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక కామెంట్స్
హైదరాబాద్ : తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందేనని, గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో జరిగిన సమీక్షలో ఓ మంచి మాట చెప్పారని పేర్కొన్నారు. వానాకాలం ముగియ గానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లకు మరమ్మతులు చేయిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తాము మొదట్నుంచి మరమ్మత్తుల్లో ఆలస్యం ఎంత మాత్రం వద్దని చెబుతూనే ఉన్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌కే మరమ్మతులు అవసరముంటాయని, అన్నారం, సుందిళ్లకు అవసరం ఉండక పోవచ్చనన్నారు. ఒకవేళ ఉన్నా ఇబ్బందేమీ ఉండదని స్పష్టం చేశారు వినోద్ కుమార్.
తుమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోయాలంటే రెండు చోట్ల లిఫ్ట్‌లు అవసరం ఉంటుందన్నారు. 152 మీటర్ల ఎత్తున గోదావరి జలాల తరలింపునకు మహారాష్ట్ర అంగీకరించే ప్రసక్తే లేదన్నారు . ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా 152 మీటర్ల ఒప్పందాన్ని సాధించలేక పోయారని పేర్కొన్నారు. ఇప్పుడు ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు.. ముంపు ఎక్కువుంటుందని ఆయన 152 మీటర్లకు అస్సలు ఒప్పు కోవడం లేదని చెప్పారు మాజీ ఎంపీ. ప్రాజెక్టులకు ఏం జరిగినా భాద్యత ఓనర్‌దే అని ఎన్డీఎస్ఏ చట్టంలోనే ఉందన్నారు. కమీషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ చేశారని , మేడిగడ్డ మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయి అన్నారం, సుందిళ్ళకు ఏం కాలేదని అందులో స్పష్టంగా ఉందన్నారు వినోద్ కుమార్.