తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్
హీరోలు ప్రజల గురించి ఆలోచించక పోతే ఎలా
ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటిపై ఆయన స్పందించారు. మొదటి నుంచీ సినిమా రంగానికి చెందిన వాళ్లను ప్రేక్షకులు దేవుళ్లుగా చూస్తారని అన్నారు. ఆప్తులమని చెప్పుకునే వాళ్లు తప్పుడు డైరెక్షన్స్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. గతంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి వాళ్లు ఒంటరిగా ఐమ్యాక్స్ కు వెళ్లి సినిమాలు చూసే వారన్నారు. కానీ దానికి విరుద్దంగా జరుగుతోందన్నారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాస్ పబ్లిక్, హడావుడి ఎక్కువ ఉంటుందని ఆ విషయం తెలుసుకోకుండా ఎలా వెళతారంటూ అల్లు అర్జున్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇదే సమయంలో హీరోలు ఫ్యాన్స్ గురించి, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించలేరా అంటూ నిలదీశారు తమ్మారెడ్డి భరద్వాజ్.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు గురువారం కలిశారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమ బాసటగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా ఇంటర్నేషనల్ స్టూడియోను ఏర్పాటు చేయాలని సీఎంకు సూచించారు నటుడు అక్కినేని నాగార్జున, దర్శకుడు కె . రాఘవేంద్ర రావు.
వీటన్నింటికి ఆమోదం తెలిపారని వెల్లడించారు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు.