మన్మోహన్ సింగ్ అసాధారణమైన రాజకీయవేత్త
నివాళులు అర్పించిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ – డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఈ దేశం అరుదైన, అసాధారణమైన నాయకుడిని, రాజకీయవేత్తను, ఆర్థిక రంగ నిపుణుడిని కోల్పోయిందన్నారు. ఇది దేశానికే కాదు తమ పార్టీకి, అంతకు మించి తనకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఇలాంటి నేతలు అరుదుగా జన్మిస్తుంటారని అన్నారు . అత్యంత దూరదృష్టి కలిగిన నాయకుడని కితాబు ఇచ్చారు.
మాజీ ప్రధాని మరణంతో భారతదేశం దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడిని, అభిశంసించలేని సమగ్రత కలిగిన నాయకుడిని, అసమానమైన పరిణతి కలిగి ఉన్న ఆర్థికవేత్తను కోల్పోయిందన్నారు ఖర్గే. అతని ఆర్థిక సరళీకరణ విధానం, హక్కుల ఆధారిత సంక్షేమ నమూనా కోట్లాది మంది భారతీయుల జీవితాలను గాఢంగా మార్చి వేసిందని కొనియాడారు. వాస్తవంగా భారతదేశంలో మధ్యతరగతిని సృష్టించి కోట్లాది మంది పేదరికం నుండి బయట పడేలా చేసిందని తెలిపారు ఖర్గే.
అచంచలమైన అంకితభావంతో ఉన్నత స్థాయికి ఎదిగి, భారతదేశ ఆకాంక్షలను సాకారం చేసిన జీవితకాల సీనియర్ సహోద్యోగిని, సున్నిత మేధావి, వినయపూర్వకమైన ఆత్మను కోల్పోయినందుకు నేను సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.
కార్మిక మంత్రిగా, రైల్వే మంత్రిగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన కేబినెట్‌లో భాగమైనందుకు గర్విస్తున్నానని స్పష్టం చేశారు. మాటల కంటే కార్యసాధకుడు, దేశ నిర్మాణానికి ఆయన చేసిన అపారమైన కృషి భారతదేశ చరిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు.
ఈ దుఃఖ సమయంలో, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ భారీ నష్టాన్ని అధిగమించే శక్తి వారికి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.